కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 6 January 2015

పాత్రో గారి ఙాపకాలలో:

           అవి నేను ఇంటర్ చదివే రోజుల్లో వచ్చిన సినిమా "సంసారం ఒక చదరంగం".అప్పటిలో వినోదవస్తువంటే టివికూడా కాదు,ఒక్క రేడియోనే.అందులో 'నీరాజనం' అని ఒక సినిమా ప్రొమోషన్ కార్యక్రమం వచ్చేది. అందులో ఆ ఆ సినిమాలకు సందించిన సన్నివేశాలు,పాటలు,వాటిని రచించినవారిగూర్చి,మాటల రచయతలగురించి,సంగీతం,నృత్యం మొదలగు విషయాలగురించి వినిపించేవారు. నేను కళాశాలకు బయలుదేరే సమయంలో ఈ కార్యక్రమాలు వచ్చేవి. అలా ఆ సినిమాలో సంభాషణలు బాగా గుర్తుకువుండి పోయాయి. అంతేకాదు ఆయా సంభాషణలు ఆ ఎదిగీ ఎదగని వయసులో ఆలోచనలను కలిగించేవి. గొల్లపూడి గారేమిటి,నూతన్ ప్రసాద్ గారు,ఇక సుహాసిని గురించి చేప్పేదేముంటుంది.నటనకు ఆమే ఆ కాలంలో ప్రతిరూపంగాఉండేది. సినిమా అంతా ఆమెకి పెద్ద సంభాషణలు ఉండవు.చివరిలో అందుకుంటుంది.మామగారిని,ఎదురించడం కాదు అక్కడ.ఒక కుటుంబంలో విభిన్న మనస్తత్వాలుకల వ్యక్తులమద్య నలిగిపోయిన ఒక కోడలి పాత్రకి ఆమె జీవం పోశారు. దానికి సుహాసినిగారి నటనకి,మన 'పాత్రో'గారి మాటలు కలసి ఎంతబాగుంటుందంటే. చివరిగా అందరం కలసే ఉందామని ఆమె మామగారు కోడలితో అంటే వద్దని సుహాసిని అన్నపుడు వారి వారి హావ భావాలు చూడాలి.నేనైతే ఈ సంభాషణలు వినీ వినీ తప్పకుండా చూడాలని చూసిన సినిమా.చివరిలో సుహాసిని అంటుంది...ఇదేమిటి అందరూ కలసి ఉండాలని కోరుకోవలసిన కోడలు విడిపోదామంటుంది అని ఆశ్చర్య పోకండి.ఉమ్మడి కుటుంబమనేది రకరకాల పూవులతో అల్లిన దండలాంటిది.దాన్ని అందరం చించి ఎవరిష్టమొచ్చినట్లు వారు ముక్కలు ముక్కలు చేసేశాం.ఇక దాన్ని మళ్ళీ గుచ్చలేం,అలాగే విరిగిన మనుషుల మన్సులను అతకగలమా? అతకలేం. కాబట్టి విడి పోదాం,విడిపోయి కలసిఉందాం. ఎప్పుడూ కలసి కొట్లాడుకునే కంటే విడిపోయి అప్పుడపుడూ, అంటే పండగలకు పబ్బాలకు కలుసుకుందాం.బాగున్నారా...అంటే బాగున్నారా! అని ఆప్యాయంగా పలుకరించుకుందాం.ఒకసారి మీరు రండి,ఒకసారి మేమువస్తాం.అని చెప్తూ ఒక వైరాగ్యపు మాట కూడా అంటుంది "కలసి ఉంటే లేదు సుఖం"అని.

        నేను ఈ పోస్టులొ వ్రాసిన సంభాషణలన్నీ ఇప్పుడే వ్రాశాను. అసలు మళ్ళీ సినిమా చూడనుకూడా చూడలేదు. ఐనా నాకు ఈ సంభాషణలు అంతలా గుర్తు ఉండిపొయాయ్.ఈ మాటలంటే పాత్రో గారు,సుహాసినిగారే గుర్తుకు వస్తారు.ఆతరువాత సీతారామయ్య గారి మనుమరాలు.కేవలం మాటల కోసం చూసా.ఎన్ని మంచి మాటలుంటాయ్ ఆ సినిమాలూఅ కూడా.భార్య చనిపోయిన తరువాత పర్వతమంత నాగేశ్వరావు గారు కుదేలై మనుమరాలితో మీ నాన్నను పిలుపించమ్మా,మీ నానమ్మ లేదు అనే సంఘటనలో వారి నటన,అక్కడి నుండీ నాగేశ్వరావుగారు,మీనా నటన,సన్నివేశాలను వేడెక్కించే సంభాషణలు.నేనైతే గుండె దిటవుగా వున్న సమయంలోనే చూస్తా ఈ సినిమాని. ఏ కాస్త నా మనసు బాగోకున్నా టివిలో ఈ సినిమాని మొదటి భాగం చూసి వదిలివేస్తా.

       ఇక మరో చరిత్ర గురించి నేను ఏమి చెప్పగలను.ఎన్ని సార్లు చూశానో .ఎప్పటికీ కొత్త ప్రేమకధలా నాకనిపిస్తుంది.'అందమైన అనుభవం'లో కూడా సన్నివేశాలు,బరువైన మాటలు మనసును పిండేస్తాయ్.


      నిన్న బాలచందర్ గారు,నేడు వారిని వెన్నంటినట్లే పాత్రో గారువెళ్ళిపోయారు. సారమంతా పోతుంది.ఇక మిగిలేది పిప్పేనని అనిపిస్తుంది.మొన్న బాపూ,రమణలు,నాగేశ్వరావుగారు,అంజలీదేవి
ఇంకెవరున్నారు వారిని భర్తీ చేయటానికి. కాలంతో పాటే మనుషులూ,మమతలూ,రచనలూ,కళలూ,అన్నీ కలుషితమే. ఏమో ముందునాటికైనా మరలా అటువంటి మహానుభావులు పుడతారని,పుట్టాలని ఆశిస్తూ. బాలచందర్ గారికి,గణేష్ పాత్రో గారికి నివాళులు అర్పిస్తూ,


                                       లక్ష్మీస్ మయూఖ.


  •          

No comments:

Post a Comment