కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 25 November 2014

శ్రీ శైల యాత్రావిశేషాలు:

                          

                                                             

      ప్రతీ సంవత్సరం కార్తీకమాసం నెలంతా ఉపవాసాలతో జరుపుకునే నేను ఈ సంవత్సరం ఉండగలనో లేనో అనుకుని ముందురోజే స్వామికి ఉండగలిగినన్ని రోజులుంటా దీక్షగా ఉంటా తండ్రీ ఆతరువాత ఒక నమస్కారంతో సరిపెడతానని మొక్కేసుకున్న. ఆ పరమేశ్వరుడు ఇంకా నామొర ఆలకించి ఈ సంవత్సరం మరింత శక్తినిచ్చాడు. కాకుంటే ఒకే నెలలో అన్నవరం,ఎప్పటినుండో కార్తీక మాసంలోనే శ్రీ శైల శిఖర ధర్శనం చేసికోవాలనే నా చిరకాల కోరిక నెరవేరడమేమిటి. అదీ నేను మొదటిసారి శ్రీ శైలం వెళ్ళటం. భగవంతుని కృపవుంటే బొందితో కైలాసంకూడా సాద్యమేననటానికి నా ఈ యాత్రలే సాక్ష్యం. 
        
      వారు అడిగినవెంటనే చూద్దాంలే ,నాకు పని హడావుడి లేకుంటే అన్నారు. 23వ తారీఖు వచ్చిందంటే ఆయనసలు దొరకరు. అన్నవరం కూడా దేవుని దయవలన ఈ సంవత్సరం పౌర్ణమికి వెళ్ళాం. చక్కగా ప్రాతఃకాలమే వ్రతం చేసికుని,వారికి బస్ లోనే అర్జీ పెట్టేశా. ఎప్పటినుండొ ఉన్న శ్రీ శైల దర్శనం కోసం. అందుకు వారు పై విధంగా నన్ను ఆశ నిరాశల మద్య కొన్ని రోజులు ఊగేలా చేశారు. ఇక ఈ సంవత్సరం కూడా నాకాప్రాప్తంలేదులే అనుకుంటుండగా నేను హైదరాబాదు వెళుతున్నా వస్తావా ఒక్కదానివేఎందుకుండటం అన్నారు. మళ్ళీ మనసులో కోరిక బయటపెడుతూ శ్రీ శైలం తీసికువెళతానంటే వస్తా నన్నా. సరే ఒక్కరోజుందికదా. 23తో చివరిరోజు కదా. సరేనా   చూస్తా నన్నారు. చూస్తానంటేకాదు,తీసికువెళతానంటే నేను దీపాలు కూడ అక్కడేవెలిగించుకునే ఏర్పాట్లు చేసికుంటాను అన్నా. సరే అన్నారు. పోయిన సంవత్సరం హరిద్వార్ లో దీపాలు వెలిగించుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. అనుకున్నదే తడవుగా టికెట్ట్స్ బుక్ చేసి,రూం కూడా బుక్ చేశారు.  

     పోయిన గురువారం నాడంకుంటా అనుకోకుండా "తేనె చినుకులు" బ్లాగు చూడటం జరిగింది. ఈ సం లోనే జనవరిలో వారు వెళ్ళారట.  విశేషాలతో అక్కడ చూడవలసిన ప్రదేశాలు,సౌకర్యాలగురించి వ్రాసారు. అంతా పరమేశ్వరుని సహకారం అనుకుని వారికి దానికి సంబందించిన సమాచారమంతా ఇచ్చి,శుక్రవారం బయలుదేరి, శనివారం హైదరాబాదులో మా పాపని సాయంత్రం కలుసుకుని రాత్రికి 9.30 బస్సుకి బయలుదేరాము.  

    మల్లన్నని ఎపుడెపుడు చూస్తానా అన్న ఆత్రంతో నాకసలు నిద్ర పట్ట లేదు . మేమెక్కిన బస్సు కాక మరో బస్సుకే రాత్రి వేళలో నల్లమల అడవిలొ ప్రయాణించే పర్మిషన్ ఉందట. అలా రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ శైలం చేరుకున్నం. మద్యలో అడవిలో జంతువులగురించి డ్రైవర్ చాలా కబుర్లు చెపుతున్నాడు. అందుకు కూడా నాకు నిద్ర రాలేదు. నక్కలను, దుప్పులు చూసాను. పగలు కనబడతాయో లేదొ తెలియదు. శ్రీ శైలం డాం మాత్రం విద్యుత్ వెల్లుగులతో ఎంత మనోహరంగా ఉందో. వెంటనే నాకు "కృష్ణవేణి"  సినిమాలో నాకూ ఇష్టమైన పాట "శ్రీ శైలా మల్లాయ్యా,దైవమే నీవయ్యా, శ్రీ భ్రమరాంభతో వెలిసిన జంగమయ్యా" గుర్తుకు వచ్చింది. హం చేసుకుంటూ ఉన్నా. అందులో సాహిత్యమంతా నేను దృశ్యరూపలో చూశా. చాలా చాలా అందమైన ప్రకృతి,దాన్ని వర్ణించడం మాటల్లో చేతకావటం లేదు. వెంటనే మల్లికార్జున సదన్ లో మా పనులన్నీ ముగించుకుని దర్శనానికి వెళ్ళిపోయాం. నాకు ప్రాతఃకాల పూజ ఇష్టం. ఇంటిలో కూడా 5 కల్లా దీపారాధన ఐపోవాలి.6కల్లా అన్నీ చదువుకోటం కూడా పూర్తవుతుంది. ఆ టైం ఐతే ఎవరీ వలన నాకు ఇబ్బంది వుండదు. ప్రశాంతంగా వుంటుంది. అందుకే ఆ టైం అంటే ఇష్టం. దర్శనం కూడా త్వరగా పూర్తైంది. బయటకివచ్చి, చాగంటి కోటేశ్వర రావుగారు చెప్పిన ప్రదేశాలన్నీ చూసి, అరటి దొప్పలో దీపాలు వెలిగించా. అక్కడే ఒకామె ఉసిరి కాయలిచ్చారు. ఉసిరి దీపాలుకూడా జమ్మికింద వెలిగించా. బయట లక్ష వత్తులు దొరికాయి. ఒక మూకుడులో నూనెతో తడిపిన వత్తులు,పసుపు,కుంకుమ,అగరుబత్తి,కర్పూరం,ఆవునెయ్యికొని ఉసిరిచెట్టులింద లక్ష వత్తులు వెలిగించా. ఈలోపు ఒకామె చెప్పారు జిల్లేడు ఆకులొకూడా దీపం వెలిగిస్తే మంచిదని. పాపం తనే అవన్నీ ఇచ్చారు. అసలు నేననుకున్నా ఈ మాసంలో ఒకసారైనా స్వామికి జిల్లేడు మాల వేయాలని.స్వామి ఆమె ద్వారా గుర్తుకుతెప్పించారనిపించింది. అదీ పూర్తిచేసి గోమాత దర్శనం,గోప్రదక్షిణ చేశాము. బయటకివచ్చి కాస్త అల్పాహారం చేసి సాక్షి గణపతి వద్దకువెళ్ళేప్రయత్నంలో ఉండగా బస్ వచ్చింది . 12 గంటలకల్లా చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించి తిరిగి గుడి వద్ద దింపుతనన్నారు. మాకు తిరిగి 4 గంటలకు హైదరాబాదుకు బస్. అందుకే టైం కూడా చూసుకుంటూ బస్లోనే బయలు దేరాం.

     సాక్షి గణపతి టెంపుల్ దర్శనం జరిగింది,మా గోత్రనామాలతో పూజ చేపించుకుని బయలుదేరి పాలధార,పంచధార, పాతాళగంగ,శ్రీ శైలం డాం,ఆదిశంకరాచార్యులవారు తపస్సు చేసిన పీఠం,శిఖర దర్శనం అన్నీ ముగించుకుని,రోప్వే లో కిందకి దిగి నదిలొకూడా దీపాలొదలి బోట్ షికారుకెళ్ళాం. 2గంటలకల్లా పైకి వచ్చి త్రిశూల్ లో భోజనం చేసాము. రూంకొచ్చి కొంచెం రీఫ్రెషై బస్టాండుకి వచ్చికూర్చున్నాం. ఒక అరగంటలో బస్ వచ్చింది. ఎక్కికూర్చున్నవెంటనే నిద్ర ముంచుకువచ్చేసింది. ఒక అరగంట తరువాత లేచేసరికి బస్ బయలుదేరలేదు. నాకు ఒకటే కంగారు. రాత్రికి హైదరాబాదునుండి మాకు కొత్తగూడెం రిసర్వేషన్ ఐపోయింది. ట్రైన్  మిస్ అవుతామేమోనని. బస్ వాడు త్వరగానే తెచ్చాడు కానీ మాకంగారు మాది కదా. ఓ అరగంట లేటుగానే బస్ స్టాండుకు చేరు కున్నాం. ఆటోలో సికిందరాబాద్ స్టేషంకి కరెక్ట్ టైంకే చేరుకుని మా సీట్లో కూచునే వరకూ కొంచెం కంగారౌ పడ్డా. ఆయనకేమీలేదులెండి, ఎప్పుడూ ప్రయాణాలు చేస్తారు కనుక.నాకే బయటకు వస్తే మళ్ళీ అనుకున్న సమయానికి ఇంటికి చేరిపోవాలి. లేకుంటే మనసు మనసులో వుండదు. ఎందుకటారా?ఎమో తెలియదు. 

     అలా శివయ్య,సత్యదేవులిరువురు,వారివద్దకు రప్పించుకోవటానికి ఓపికనిచ్చి సహకరించారు. నేను వ్రాసినదానిలో నా ప్రయత్నమెంత?భగవంతుని దయ ఎంత?సంకల్పం ఉంటే దానికి భవతుని సహకారం తప్పకుండా ఉంటుందనటానికి ఈ సం..నా యాత్రలే తార్ఖాణాలు. ఒక్క చిన్న అసంతృప్తి మాత్రమే కలిగిందీ యాత్రలో. అది ఇష్టకామేశ్వరి ఆలయానికి సమయాబావంవలన వెళ్ళలేకపోయాను. అమ్మ ఈసారైనా కరుణిస్తుందేమో చూడాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారుగా.ముందునాటికి అదికూడా ప్రసాదించమని ఆ అమ్మను కోరుకుంటాను.  
             ఇవండీ నా శ్రీ శైల యాత్రా విశేషాలు. దోషాలుంటే మన్నించగలరు.తెలియని విషయాలు పెద్దలు తెలియచేయగలరు.ఉంటాను.మళ్ళీ మరో టపాతో కలుస్తా.                                                                                                                                                                                                                     

Tuesday 18 November 2014

కూడలి బ్లాగరులారా, నా బ్లాగు పేరు "లక్ష్మీస్ మయూఖ" గా గుర్తించగలరు. ధన్యవాదాలు. 

Saturday 15 November 2014

నా గురించి:

   



 
     నేనొక గ్రుహిణినండి. నాకు చాలా అభిరుచులున్నాయి.చదవటమంటే చాలా ఇష్టం. ఏ విషయమైనా తెలిసికోవాలనే కోరిక. అది చదవటంద్వారానైనా, చూడడంద్వారానైనా. నాకు తెలిసిన విషయాలను నలుగురికి చెప్పాలని అనిపిస్తుంది.నాకు స్నేహితులతో గడపడమంటే చాలా ఇష్టం. ఉన్న కొద్ది మంది స్నేహితులలెవరికి దూరంగావుండను. నాకు పాత తెలుగు, హింది,తమిల్ పాటలంటే చాలా ఇష్టం. సావిత్రిగారు, భానుమతిగారు, వాణిశ్రీ లంటే చాలా అభిమానం.సంగీతమంటే ప్రాణం. మొక్కలు పెంచడం నా మరో అభిరుచి. వంటలు చాలా బాగా చేస్తానని నా స్నేహితులందరి అభిప్రాయం.మా పిల్లలు కూడా మా అమ్మే "బెస్ట్ కుక్'అని బిరుదిచ్చేశారు.పాత సినిమాలు, కొత్తవాటిలో మిధునం, ఆనలుగురు,దేవస్తానం లాంటివి చూస్తూ వుంటాను. నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు లేరు.  "నాకెపుడూ నాకిది రాదు" అని అనిపించుకోవద్దూ అని చిన్నప్పటినుండి చెప్తూ పెంచారు. చాలవరకూ ఆయన ఎలా పెంచారో అలాగే పెరిగాను.కాకుంటే పిల్లల పెంపకంకోసం గ్రుహిణిగా స్థిరపడిపోయాను. చాగంటి కోటేశ్వరవుగారు, స్వామి పరిపూర్ణానంద స్వామి, సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనాలు క్రమంతప్పకుండా వింటా. నాకున్న మరో లక్షణం పెద్దవారితో స్నేహం.మా అమ్మ నన్ను ఎప్పుడూ అంటూ వుండేదీముసలివాళ్ళతో' ముచ్చట్లు పెడతానని. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. అంతత్వరగా నా అలవాట్లను, అభిరుచులను మార్చుకునటానికి ఇష్టపడను.దానివలన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా కూడా . ఐనా నేను నాలానే ఉండడానికి ఇష్టపడతాను.
          ప్రస్తుతానికైతే ఇంతేనండి. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ మరో టపాతో కలుస్తానండి.
          కాస్త నా టపాలను కూడా కొంచెం చూసి స్పందించండి.తప్పులుంటే క్షమించండి.                
   

Saturday 8 November 2014


                   
                 
     నిన్నటి వరకూ బ్లాగులు చదువుతూ చాలా విషయాలు తెలిసికుంటూన్న నేను బ్లాగు మొదలుపెట్టి పోస్ట్లు వ్రాసేటపుడు మాత్రం తడబడుతున్నా. మరలా చదువు మొదలుపెట్టినట్లనిపిస్తుంది.ఇనాళ్ళూ ఇల్లు,పిల్లలు,చదువులుతోనే నారుచులు,అభిరుచులు మరుగునపడిపోయాయి. ఈమద్యే మా పాప సాయంతో బ్లాగు మొదలుపెట్టడం జరిగింది. ఎప్పుడూ ఎదోఒకటీ చదవాలని, వ్రాయాలని వుందేడేది.అందుకు నాకు ఈ అవకాశం దొరికింది. కాకుంటే గ్రుహిణిగావున్నందుకు కొంచెం తీరిక తక్కువనే చెప్పాలి. దొరికిన వెసులుబాటు సమయాన్ని మాత్రం ఎదో ఒకటి చదవటానికే ఇష్టపడతాను. కనుక దీనికిముందు తపాలలో దొర్లిన తప్పులను ఇకముందు పునరావ్రుతంకాకుండా చూస్తాను. బ్లాగుమిత్రులందరూ మన్నించగలరు.

                       

Friday 7 November 2014

   

          ఇప్పుడే ఒకచోట చదివా 'స్వచ్ భారట్ గురించి. తీరిక దొరకక వ్రాయలేదుగాని, మొన్న ఒకరోజు ఎప్పుడొ ఎందుకండి 3వ తారీకు విజయవాడవెళ్ళా. బస్టాండులో దిగిన దగ్గరనుంచీ చూస్తే,  ఎందుకు రోజూ వార్తలలో ఎక్కడ చూసినా అందరూ చీపుర్లతో ఫొటోలకి ఫొజులు .చూస్తే ఒకటే కంపు, ప్రయాణప్రాంగణమంతా  చిరుతిళ్ళ కవర్లతో, వదిలివేసిన అన్నాలు ఎంత అసహ్యంగా ఉందో.కొంచెంసేపు అక్కడ గడిపితే రోగలు రావడం కాయం అనిపించింది. పాపం మోది గారు ఒక్కరే 'స్వచ్ భారట్ అని అనుకుంటే చాలదుగా, ఎవరికివారు మనము, మనచుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలనే అనుకోవాలిగా. రోగాలువస్తే దవాఖానాలకి డబ్బులు తగలుబెడతారు.కాని అవి రాకుండా చూసుకునేప్రయత్నాలు చేయరు. ఎలా అండి, ప్రపంచం ఎంతవేగంగా దూసుకుపోతుందో చూస్తూ కూడా, ఒకరు ఒకరికి శుభ్రత గురించి చెప్పాలా? మొదట ఇంటినుండే స్వచ్ భారత్ మొదలు కావాలి. ఇల్లాలుగా ఇంటిని,ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే అది ఇంటిల్లపాదికి అబ్బుతది, దాని విలువతెలుస్తుంది. సమాజంలో ఆ అవగాహన రావాలి. ఇప్పటివరకూ వచ్చిన ,ఏలిన పాలకులని బియ్యమని, పప్పూని, ఉప్పని అడిగారేగానీ, మాకు మంచి శుభ్రమైన పరిసరాలు కావాలి అందుకు కావాలంటే మేము సహకరిస్తామని ఎవరైనా అడిగారా? పాలకులు కూడా వాటితోనే పొద్దుపుచ్చి వారి కాలం గడిపేస్తున్నారు. అవునా, కాదా? ఇప్పుడు అసలు మనం ఆరొగ్యంగా ఉంతేనేకదా ఉప్పులు,పప్పులు,కొంపలు,గోళ్ళు. ఆ విషయాన్నే మోదీ  సాబ్ గుర్తించారు. కనీసం ఆయన కొత్తగ ఆలోచించినందుకైనా కొంతలోకొంతైనా పాటించుదామని అటు నాయకులలో కలగటంలేదు, ఇటు ప్రజలలో కలగటంలేదు. ఎక్కడైనా స్తలాలిస్తున్నరంట,చీరలిస్తున్నారంట అంటే పరుగులు పెడతారు. పైరవీలు చేసైనా సాదిస్తారు. కానీ మనకోసం, మన కుటుంబ సంక్షేమంకోసం పరిసరాలని శుభ్రంగా ఉంచుకోలేరు. ఈ కాలంలో కూడా దీన్ని ఒక సంక్షేమ కార్యక్రమంలా ప్రకటించాల్సివచ్చినందుకు సిగ్గుపడాలి. టివిలలో ప్రకటనలు చూస్తున్నాం. విదేశీయులు మనదేశంలో ఎదుర్కునే అనుభవాలతోకూడినవి. అవన్నీ వాస్తవాలు కాదా? ఇంకా ఎన్నాళ్ళు? ఇంటికొకరైనా విదేశాలలో ఉంటున్నరోజులలోకూడా ఇలాటి స్థితిలోనే ఇంకా మన దేశముండటం మనదౌర్భగ్యమనుకోవాలా? బహిరంగంగా మూత్రవిసర్జన చట్టరీత్యా నేరంగా పరిగణించి పెనాలిటి అదే ప్రదేశంలో కట్టించుకోవాలి. ఎన్ని సౌకర్యాలు కలిపించినా వాటిని వాడని మనంత మూర్కులు మరెక్కడ ఉండరు.బహిరంగ ధూమపానం, మద్యం సేవించి డ్రైవింగే కాదు ప్రయాణంలు కూద శిక్షలకింద పరిగణించాలి.మొన్న అన్నవరం వెళ్ళాకదా నేను వెళ్ళే బస్లోనే ఇద్దరు తాగి ప్రయాణం చేసారు. ఏమనుకోవాలి. అల్లాంటివారితో కలసి ప్రయాణం ఎంత అసౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి.విజయవాడ ఊరుఊరంతా యూరినల్స్ వాసనతో చాలా సిగ్గనిపించిందనుకోండి.ఇదా స్వర్ణాంద్రప్రదెశ్ రాజధాని అని అనిపించింది. పాలకులేకాదు ప్రజలుకూడా ఆలోచించాలి. అది పౌరులుగా అందరం గుర్తెరిగి ఇకనైనా బాద్యతగా మసలుకోవాలని మసలుకుంటారని నా ఈ బ్లాగ్ ద్వారా అందరిని కోరుతున్నా. మనము మనంపుట్టినఊరికి మంచి చేయకపోయినా పరవాలేదు ,కానీ విద్యలవాడ విజయవాడ పేరు చెడగొట్టవద్దని మనవిచేస్తున్నా.  సహ్రుదయంతో ఆలోచించి సహకరించగలరు.               
 7 శుక్రవారం నవంబర్ 2014

     అన్నవరం సత్యదేవుని ధర్శనం

  మొన్న బుధవారం నాడు నేను,వారు అన్నవరం వెళ్ళాం.ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలో సోమవారం గానీ పౌర్ణమికి కుదిరితే వెళ్ళి వ్రతం చేసుకుంటాం. కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ..పిల్లలు అందుబాటులోలేకూన్నా ఇద్దరం వెళ్ళి వ్రతం శుభకరంగా ముగించుకొనివచ్చాం. సాయంత్రం 5గంటలకు అన్నవరం చేరుకుని రూంలో విశ్రాంతితీసికుని, ఉదయమే 2గంటలకు వ్రతానికి కూర్చున్నాం. చాలా చక్కగా జరిగింది. 4గంటలకు వ్రతం పూర్తికాగానే వెంతనే దర్శనం కూడా పూర్తైంది. బయటకు వచ్చి ఇద్దరం ద్వజస్తంభం ముందు వత్తులు వెలిగించాం.దేవునికి పెట్టుకోవలసిన అర్జీలు పెట్టుకుని, మనస్పూర్తిగా నమస్కారం చేసుకుని రూంకి వచ్చెశాం. కొంచెంసేపు విశ్రాంతి తీసికుని కిందకి వచ్చేసరికి 6.30. 7కి బస్సు బయలుదేరింది. ఇంటికివచ్చేసరికి మద్యాహ్నం 3ఐంది. వచ్చీరాగానే పౌర్ణమికి దీపాలు వెలిగించే పూజ ఏర్పాట్లు చేసుకుని, సాయంత్రం అందరికీ సత్యదేవుని ప్రసాదం పంచి పూజాకార్యక్రమాలు పూర్తయ్యాయి. అలా ఈ సంవత్సరం నిర్విగ్నంగా నా అన్నవరం యాత్ర, పౌర్ణమి కార్యక్రమాలు పూర్తయ్యాయి. అంతా ఆ సత్యదేవుని దయ, ఎప్పటికి ఇలా చేసుకునేభాగ్యం కలిగించమని పడుకునేముందు ఆ పరమాత్మని కోరుకుని నిద్రకుపక్రమించా.

             ఇదండీ నా అన్నవరం యాత్రా కథ. బాగా బోర్ కొట్టించానా, మీ అందరితో పంచుకోవాలని అనిపించింది, వుంటాను.