కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 27 January 2015

ఙాపకాల దొంతరలు:

     ఇంతకుముందే చదివా "ఆలోచనలు"బ్లాగులో 'మా పల్లె అందాలూ శీర్షిక. చాలా బాగుంది. అసలు పల్లెలే అందంగా ఉంటాయ్ కదా. అలా అందరం మన మన పల్లె అందాలు వ్రాస్తూ పోతేనన్నా ఈతరానికి పల్లెల అందమేమిటో,మనం కోల్పోయిన అనుభవాలు,అనుభూతులు,ప్రేమలు,ఆప్యాయతలు తెలుస్తాయేమో.

    నిజంగా మా అమ్మమ్మగారి ఊరు కూడా చాలా బాగుండేది. మాది మచిలీపట్నం దగ్గర కలపటం అనే చిన్న గ్రామం. అందులో ఇళ్ళుకూడా చాలా తక్కువ వుండేవి. అన్ని కులాల వారూ కలసి ఉండేవారు. తాతగారు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ముగ్గురు తాతల ఇళ్ళు పక్క పక్కనే వరుసగా ఉండేవి. సంక్రాంతి పండుగకి ఎక్కువరోజులు ఉండేవాళ్ళం మేము. మా తాతగారే పెద్దవారు కనుక మొదలు మా ఇల్లే వుండేది. సంక్రంతి నెల పట్టినదగ్గరనుంచీ పిన్నీ వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. రోజూ గొబ్బిళ్ళు పెట్టేవారు.అవికూడా ఒకటి రెండూ కాదు.ముప్పై,నలభై చేసేవారు. అంత పెద్ద వాకిలిలో పెద్ద మెలికల ముగ్గు,దాని నిండా పసుపు కుంకుమ,గొబ్బిళ్ళు.వాటికి అగరుబత్తి వెలిగించి బెల్లం,ధాన్యం నైవేద్యంగా పెట్టేవారు.నేను మా పిన్నులచుట్టూ తిరుగుతూ చాలా ఆసక్తిగా ఆలకించేదాన్ని.మద్యహ్నం నుంచీ పిండి వంటల చర్చలు మొదలయ్యేవి.ఈ రోజుల్లోలా కేజీ,రెండు కేజీలు కాదు ఆరోజుల్లో పది,పదిహేను కేజీలు బియ్యం పోసి,నానిన తరువాత దొడ్లోనే రోకళ్ళతో పిండి కొట్టే వారు. ఒకరోజు మా అమ్మమ్మ వాళ్ళింట్లో మరుసటి రోజు ఇంకొకరింట్లో,అలా ముగ్గురిళ్ళలో ఎక్కడచూసినా పిండివంటల వాసనలే. అన్నీ ఇంట్లోవే. దేనికీ బయటకు వెళ్ళే అవసరం వుండేది కాదు. వండిన పిండివటలను భోషాణంలో సర్దించేవారు తాతగారు.దాని తాళాలు ఆయనదగ్గరే ఉండేవి.రోజుకి ఒకసారే తాళం తీసి కావలసినంత బయట ఉంచేవారు. బోగి రోజుకల్లా పొలందగ్గరనుంచీ పెద్ద బల్ల తెప్పించేవారు. బొమ్మలకొలువుకు సిద్దంచేపించేవారు. ఎన్ని బొమ్మలో. నేను కొత్తబొమ్మలు కావాలని మారాం చేస్తే అమ్మమ్మ వడ్లు పోసి కొని ఇచ్చేది. అలా చాల బొమ్మలు కొనిపించుకున్నా. ఈ బెజవాడ పిల్లవస్తే ఉన్నచోట ఉండదు,కర్చు పెట్టిస్తదని,సొమ్ము మీ నాన్న దగ్గరనుంచీ తీసికుంటామని అనేది. పండుగైనతరువాత తిరిగి వచ్చేటపుడు బొమ్మ లివ్వమంటే అస్సలు ఇచ్హేది కాదు. మళ్ళీ సంవత్సరం వస్తావుగా అప్పుడు కావాలిగా అని, అన్నీ బుట్టకెత్తించి పైన అటకెక్కించేది అమ్మమ్మ. అమ్మమ్మతో పాటే అన్నీ పొయాయ్.ఏ మైనావో కూడా తెలియదు. అత్తావాళ్ళు వచ్చినతరువాత ఇంటి పరిస్తితులు మారి,వెళ్ళడం తగ్గి పోయింది. వెళదామన్నా మా అమ్మా వాళ్ళే "ఆ ఎవరున్నారు,ఏముందక్కడ,అంతా మా పెద్దవాళ్ళతోనే పోయిందని" నిరుత్సాహపరుస్తారు. వాళ్ళకే లేనపుడు మేమెలా వెళ్ళగలం.కానీ ఆ ఙాపకాలు డిసెంబర్ వస్తేచాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయ్. అక్కడకెళ్ళకపోయినా ఆ నెలరోజులూ ముగ్గులు వెయ్యటం,పండుగ మూడు రోజులూ గొబ్బిళ్ళు పెట్టటం చేస్తా. కొన్నాళ్ళు వారు విసుక్కున్నారు. ఇపుడు ఈమె ఇంతేనని సహకరిస్తున్నారు. నా పిల్లలు చేయకపోయినా నేను చేసుకుని,అవి చూసి మురిసిపోతుంటా.  

    మా ఊరు కూడా పచ్చని పొలాలతో చిన్న చిన్న చెరువులు,దాని నిండా తామరలతో చాలా అందంగా ఉండేది, మా అమ్మమ్మవాళ్ళ వీధి చివర రామాలయం ఉండేది. తాతగారువాళ్ళకే చాలా పెద్ద పసువుల కొట్టం ఉండేది. పాలు,నెయ్యి,పెరుగు సంవృద్దిగా ఉండేవి. పెరట్లో కాసిన కూరగాయలతోనే కూరలు.పొలమునుండీ కూడా తెచ్చేవారు. ఏవీ కొనే పని ఉండేది కాదు. గుడ్లు కూడా ఇంటిలోనివే,అన్ని కోళ్ళు ఉండేవి. ముగ్గురు తాతగారి ఇళ్ళలోవాళ్ళం కలిస్తే దగ్గర దగ్గర యాబై మందిమి అయ్యేవాళ్ళమేమో.అర్దరాత్రిదాకా కధలు,కబుర్లు,ఆటలు,పాటలు.పెద్దవాళ్ళు పగలంతా పనిచేసి ఆదమరిచి నిదర్లు పోయేవారు. అప్పట్లో కిరోసిన్ దీపాలు.మేము మా లోగిట్లో కూర్చుంటే వెన్నెల తెల్లగా పట్ట పగలులా వుండేది. ఏ భయాలు ఉండేవి కాదు.ఎంత ఆలస్యంగా పడుకున్నా పొద్దునే అందరూ విధిగా లేచి ఎవరి పనులలోకి వారు వెళ్ళి పోయేవాళ్ళు. అంత క్రమశిక్షణ ఉండేది. అరుపులు,కేకలు ఉండేవి కాదు. ఎవరి పనులు వారు టైంకి పూర్తి చేసే వారు.

     పండుగ మూడు రోజులముందు నాన్న వచ్చే వారు. నాన్న అంటే అందరికీ భయంగా ఉండేది.(అప్పుడు భయమను కున్నా,అది గౌరవం అని పెద్దైనాక తెలిసింది)వస్తూ నాన్న కొత్త బట్టలు తెచ్చేవారు.అదికూడా చాలా ఖరీదువి తెచ్హేవారు. అందరూ చాలా బాగున్నాయని మురుసుకునేవారు.అమ్మమ్మ పొద్దుగూకిన తరువాత అన్నయ్యలకి,నాకు దిష్టి తీసేది. అందరికళ్ళు నా పిల్లల్లమీదే ఉన్నాయని ఉడుక్కునేది. తిరిగి వచ్చేటపుడు అమ్మ ఎంతమందికి చెప్పిరావాలో.మేము కూడా చిన్న తాతా,అమ్మమ్మ,మామయ్యలు,పిన్నులు,మామ్మలు,ముత్తవ్వలు అందరికీ చెప్పి,అమ్మమ్మ ఇచ్చిన పిండి వంటలు క్యానులకు సర్దుకుని,తాతయ్య బుస్ ఎక్కించటానికి రోడ్డు వరకూ బండి కట్టించేవారు. మద్య మద్యలో చిన్న చిన్న ఊర్లు వచ్చేవి. పెద్దవాళ్ళు కొందరు ఎవరు?ధర్మరాజు(మా తాత గారి పేరు)అని అడిగితే పెద్దమ్మాయ్ వచ్చింది పండుగకి,తిరిగి పంపుతున్నా,అని తాత చెప్తూ అలా మెయిన్ రోడ్డుకి చేరుకునే వాళ్ళం.తలకటూరు వచ్చి విజయవాడ బస్ ఎక్కేవాళ్ళం.బండిలో వస్తూ వుంటే పొలాల్లో రకరకాల పిట్టల కూతలు,ఆ ప్రకృతి ఎంత అందంగా ఉండేవో.ఇవన్నీ మోసుకుని విజయవాడ చేరే వాళ్ళం. ఇప్పటికీ ఆయా పిట్టల తాలూక శబ్దాలు వినిపిస్తే నేను నా బాల్య స్మృతుల్లోకి వెళ్ళిపోతాను.

       ఈ ఙాపకాలను ఎప్పుడన్నా ఎవరితోనైనా పంచుకుందామనుకుంటే వినే వారేరి?పిల్లలు కూడా అబ్బా మమ్మీ...అంటారు.పెద్దన్నయ్య, నేనే ఇంకా ఈ ఙాపకాలను నెమరువేసుకుంటూ వున్నాం.నిజంగా ఆ రోజులే బాగున్నయ్.ఏదో అంటారు కదా"కాకై కలకాలం బతికే కన్నా,హంసలా ఆరు నెలలు బతికితే చాలని".అలా ఆస్తులు,ఆడంబరాల ఈ జీవితం కన్నా,కల్లా కపటం తెలియని అలాంటి మనుషులు,ప్రేమలు తప్ప మరొకటి తెలియని మనుషుల మద్య అటువంటి బాల్యం మళ్ళీ పొందాలని ఉంది.దేవుణ్ణైనా అదే కోరుకుంటున్నా.వెలలు కల ఈజీవితమొద్దు,వెలకట్టలేని నా బంగారు బాల్యాన్ని నాకివ్వమని.

     బోరు కొట్టిస్తే ఈ పోస్టు చదివిన వారు మన్నించండి.ఈ రోజు ఆ "ఆలోచనలు"బ్లాగు చూసి చదవకపోయినట్లైతే బహుశా ఈ నా స్మృతులన్నీ నాతో,నాలోనే నిక్షిప్తమైపోయేవేమో.ఏమొ మీ అందరితో పంచుకోవాలనిపించింది.చెప్పాను.చదివి మీ స్పందనలు చెప్పండి.          

No comments:

Post a Comment