కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 7 April 2015

నిజంగా "రోజులు మారాయ్":

   నిన్న చాలా సంవత్సరాలతరువాత విజయవాడలో షాపింగుకు వెళ్ళాను.90ల లో నేను చదువుకునే రోజుల్లో ఎక్కువ వస్త్రలతలో శిల్ప టెక్స్ టైల్స్ అని వుండేది. నాకు సంబందించినంతవరకు నాకు నచ్చే శారీస్ అన్నీ దానిలోనే కొనుక్కునేదాన్ని.లేకుంటే నెల్లూరు నుండి ఒక తాతగారు వెంకటగిరి శారీస్,చిన్న వయసువారికి నప్పే ఫాన్సీ చీరలు తెచ్చేవారు.ఇక ఈ రెండు చోట్లే నా వివాహంవరకూ షాపింగ్.నేను చదువుకుంటూనే నా కర్చులకు సరిపడా ట్యూషన్స్ ద్వారా సంపాదించుకునేదాన్ని.

    ఇంతకూ అసలు విషయం చెప్పనేలేదు కదూ.ఇలానే ట్రాక్ తప్పేస్తూవుంటా.వస్త్రలతలో ఆషాప్లోనే చీరలు కొనేదాన్ని అని చెప్పాను కదా.అందులో ఒక పెద్దాయనవుండేవారు.వారి కొడుకులేమో గుర్తుకులేదుకానీ వారూ వ్యాపారంలో ఆయనకు సహకరిస్తూ వుండేవారు.నేను,నా స్నేహితులు అక్కడే కొనేవాళ్ళం కాబట్టి పెద్దాయన వాళ్ళ పిల్లలతో అమ్మాయి వచ్చిందిరా అడిగింది ఇచ్చి పంపండి అని నేను ఎంతకు అడిగితే అంతకు ఇప్పించేవారు.ఆ అన్నయ్యావాళ్ళు కూడా నీకనగానే నాన్న ఏమీ చూడడు తీసికో అనేవారు.ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నాకు బాగా గుర్తు,వాళ్ళు వాళ్ళ ఇంటిలో చెల్లి కోసం ఓ చీర బ్లౌజ్ తోసహా సెట్ గా పెట్టి ఉంచుకున్నారు.నేను అనుకోకుండా కొత్త కాపురానికి  రామగుండం వెళ్ళిపోతున్నా,అప్పుడు అమ్మ ఓ చీర పెట్టాలి తెచ్చుకో అంది.షాపుకి వెళ్ళా.కొత్తగావచ్చిన సెట్ చూపించి చాలా రేర్ కాంబినేషన్ చూపించి ఇది మా చెల్లికోసం పెట్టాం.వేరే రంగులున్నాయ్ అందులో తీసికోమన్నారు.ఈ సెట్ విడిగా లోపల పాక్ చేసిఉంది.నేను నాకేవీ వద్దు ఇదేకావాలని,నేను ఇలా వెళ్ళిపోతున్నానని చెప్పా.వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు,(ఇప్పుడు వాళ్ళ ముఖాలుకూడా గుర్తుకు రావటంలేదు)తీసికువెళ్ళు నిన్ను వుట్టికేపంపమని ఆ కవర్ నాకిచ్చేసారు.అలా ఇప్పటికీ ఆ అన్నయ్యవాళ్ళు గుర్తున్నారు.

    ఇప్పుడు అసలు విషయానికివద్దాం.నిన్న 92 తరువాత వస్త్రలతకు వెళ్ళా.ఆ షాపుకోసం వెతికాను రోడ్డువైపుకే వుండేది.కనపడలేదు.లోపలకి వెళ్ళాను.ఏదో ఓ షాపులోకివెళ్ళాను,మా కజిన్ వాళ్ళ పాప పెళ్ళి షాపింగ్ అనమాట.ఆ షాపతను మాట్లాడుతున్నతీరు నాకు చాలా చిరాకనిపించింది.మొదలే అతన్ని అడిగానుకూడా.ఫలానా షాపు ఉండాలికదా అని.వుంది పక్కనే.ఆ సమాధానం కూడా ఒక మృదుత్వం లేదు.నాకు వెంటనే అన్నయ్యావాళ్ళు గుర్తుకువచ్చారు కానీ,వాళ్ళ ముఖాలు గుర్తు లేదునాకు.బహుశా నేనుకూడా వారికి గుర్తువుండకపోవచ్చు.కాలంలోవచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది.అప్పటి మనుషులకు,ఇప్పటి మనుషులకు మద్య ఎంత వ్యత్యాసం.చాలా విడ్డూరమనిపించింది.చిరాకనిపించి నచ్చినవి కూడా అక్కడే పడేసి వచ్చాం.ఇది ఇప్పటి విజయవాడలే అని సరిపుచ్చుకున్నా.కానీ నిన్నటి నుంచీ మనసులోమాత్రం ఏదో తెలియని బాధ.సాటి మనుషులతో ఓపికగా,మర్యాదగా నేడు ఎందుకు మనం ప్రవర్తించలేకపోతున్నాం?.

    ఇదే అనుభవమనుకుంటున్నారా!ఇంటిదగ్గర నెల్లూరు తాతగారు,వారి కొడుకు వచ్చే వాళ్ళు.ఆ తాతగారుకూడా అంతే.అమ్మాయ్ అడుగుతుంది ఇచ్చేయరా అని నేను ఏది ఇష్టపడితే అది మా ఇంటిలో పెట్టి వెళ్ళేవారు.ఒక సారి వాళ్ళ అబ్బాయ్ నాకు నచ్చినది రేటు కుదరదని తిరిగి తీసికున్నాడు.మళ్ళీ నెలలో తాతగారికి చెప్పాను. అన్నయ్య నాకు నచ్చినది తిరిగితీసికున్నాడని.అంతే ఆయన కోప్పడి,ఆడబిడ్డరా చదువుకుంటూ,సంపాదించుకుని కొనుక్కుంటుంటే ఇవ్వాలిరా అని చెప్పి మరలా నెలలో నాకు అలాటిదే తెప్పించి ఇప్పించారు.ఆయనకు మా పేటలో అసలు రేటు దిగడు అని పేరు ఉండేది ఆరోజుల్లో.ఆ అన్నయ్య అనేవాడు,అందరికీ తగ్గడు,మీ పాప అంటే "బంగారం" అని మానాన్న ఇచ్చేస్తారని మా అమ్మకు చెప్పేవాడు.నిజంగానే ఆ తాతగారు నన్ను బంగారం అనే పిలిచేవారు.

    అలాంటి మనుషులను చూసి,నిన్నటి మనుషులను చూసిన నేను ఎందుకు మనుషులిలా మారిపోయారని తెగబాదపడిపోతుంటే,ఇంటాయన అందరికీ నీలా తీరికవుండవద్దు.కొంచెం ఎవరైనా సాయమడిగితే చాలు అల్లుకుపోతావ్.అంత అవసరమా?,అంతా నాదేననుకుంటావ్,నేనే అవ్వాలనుకుంటావ్.ఎవరికి చెప్పు.అవసరం ఐనతరువాత ఈ రోజుల్లో ఎవరికివారే,మీరెవరో మాకు తెలియదన్నా ఆశ్చర్య పోకూడదని(ఇది ఎన్నోసారో గుర్తులేదు)హితబోధ చేశారు. రేపు మీరూ అంతేనా?అన్నా,అని మనసులో అనుకున్నటున్నాననుకుని పైకి అన్నా,ఏమిటీ?అన్న ఆయన మాటకి "ఆ ఏమీ లేదు మీకు స్నాక్స్ ఏమిచేయాలని అడుగుతున్నా అని కవర్ చేసా. చూసారా   

1 comment:

  1. పూర్వం పెద్దలు ఆడపిల్లల్ని అలా లక్ష్మీస్వరూపాల్లాగా అభిమానంగా చూసుకొనే వారు. వారు స్వంత బిడ్డలయ్యేది కాకపోయేది తేడా ఉండేది కాదు. ఇప్పుడు స్వంత అప్పచెల్లెళ్ళపట్లనే అభిమానాలు కరువుగా ఉన్నాయి. అంతా యాంత్రిక జీవితం మహిమ!

    ReplyDelete